Jul 22, 2012

సంపంగి శాపం


ఎంతో సువాసన ఇచ్చే సంపంగి పుష్పమును దేవుని పూజ లో ఉపయోగించము,,కారణము ఏమిటో తెలుసుకొందాము,,
ఒకానొక కాలంలో ఒక దురాత్ముడు ఉండేవాడు. అయినను అతడు నిత్య శివపూజాసక్తుడు. ప్రతిదినం సంపెంగలచేత శివుని పూజించి ఆయన కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రుడైనవాడు.
ఆ దేశపు చక్రవర్తినే శాసించగల స్థితికి చేరుకున్నవాడు. చక్రవర్తి అంతటి వాడిని, పాదాక్రాంతుడిగా చేసుకున్న గర్వంతో అతడు ప్రజలను పీడించసాగాడు. కానీ, అతడిపై ఫిర్యాదు చేసినా రాజు పట్టించు కొనేవాడుకాదు.
ఇలా ఉండగా - అతడు ప్రతిరోజు తన అర్చన (సంపెంగపూలతో) మానివేయకుండా జాగ్రత్త పడుతూవచ్చాడు. ఆ కారణాన అంతులేని శివానుగ్రహానికి పాత్రుడయ్యాడు.
నారదుడు ఓసారి భూలోక సంచారార్థం వచ్చినప్పుడు ఈ వైనం అంతా చూశాడు. కానీ ఆయనకు మొదట్లో ఈ దుష్ఠుని అంతర్యం అంతుపట్టలేదు.
అతడెటువంటివాడని అడగ్గా, సంపంగి బదులివ్వలేదు. కేవలం ఆ దుష్టబుద్ధి అకృత్యాలకు భయపడి సంపంగి మారుపల్కలేదు.
అయినా దేవర్షి అంతటివాడు అడిగినప్పుడు సత్యం చెప్పాలి కదా! దుష్టుని బెదిరింపు వల్ల చెప్పలేకపోవచ్చు! అసత్యమేల? నారదుడు తరచి తరచి ప్రశ్నించినా తనకేమీ తెలియదంది సంపంగి.
అసత్యదోషానికి పాల్పడినందువల్ల "నేటినుంచీ నీ పూలు శివపూజార్హత కోల్పోవుగాక!" అని శపించాడు నారదుడు.
అంతవరకు శివప్రీతికరమైన సంపెంగకు శివపాద సన్నిధి చేరే అవకాశం నశించింది.
                                                                                    (శ్రీ శివ మహాపురాణము నుండి సేకరించిన కధ ) 

మంత్రం



శ్రీకృష్ణ భగవానుని మూల మంత్రం :
" కృం కృష్ణాయ నమః "

ఇది శ్రీకృష్ణుని మూల మంత్రం. ఎవరైతే తమ జీవితాన్ని సుఖ-శాంతులతో గడపాలనుకుంటున్నారో అలాంటివారు ప్రాతఃకాలాన్నే నిద్రలేచి స్నానపానాదులు కావించి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మనిషి అన్ని రకాల బాధలు, కష్ణాలనుంచి విముక్తుడౌతాడని పురాణాలు చెపుతున్నాయి. 

చతుర్భుజం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టం శివాం శివకరీం సతీమ్ 2

అని ధ్యానించి మంగళవారం, శుక్రవారం పూట ముత్తైదువులు, కన్యలు ఇంటి ముంగిట దీపం వెలిగించినట్లైతే ఆ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు అంటున్నారు.

శ్రావణ మాసం


శ్రావణ మాసం అని ఎందుకు పేరు ? అంటే మనయొక్క మొరలని ఆలకించేందుకు ఆ తల్లిని సిద్దపరిచే మాసం కనుకనే శ్రావణం అని పేరు. మన మొరలని ఆలకించే సమయం, శ్రవణ సంబంధమైన మాసం శ్రావణము. ఈ మాసంలో అమ్మ మనకు ఏకాంతంగా లభిస్తుంది. చాతుర్మాస్య క్రమం తెలుసుకుంటే అర్థం అవుతుంది. ఆషాడ మాస ఏకాదశి వరకు స్వామితో నిరంతరం ఉండే తల్లి పాలకడలిలో స్వామిని యోగ నిద్రలో పవళింపజేసి జగత్ రక్షణ ఎట్లా చేయాలో ఆలోచించుకోవడానికి కావల్సిన సమయాన్ని ఆయనకు ఇవ్వడానికి స్వామికి విశ్రాంతినిచ్చి అమ్మ బయలుదేరుతుంది. తరువాత వచ్చే మాసమైన శ్రావణ మాసంలో అమ్మ అందరి మొరలు వినడానికి అందుబాటులోకి వస్తుంది. అందుకే అమ్మను ఆరాధన చేస్తుంటారు. శ్రావణ మాసం అంతా అమ్మను ఆరాధన చేయడానికి వీలైన సమయం. ప్రక్కన స్వామి లేనప్పుడు మన భాదలను అమ్మతో ఒంటరిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తరువాత మాసం భాద్రపద. మనకు భద్రములను కలిగించడానికి చేసే మాసం. ఆతరువాతి మాసం ఆశ్వయుజ మాసం. అప్పుడు స్వామిని అమ్మను ఇరువురిని కలిపి పూజ చేయడానికి పూర్వ రంగం. అందుకే దసరా పండగనాడు స్వామి అశ్వవాహనం పై బయలుదేరి వస్తాడు. దానికి ముందు అమ్మ అనేక రూపాల్లో ఆరాధనల్ని అందుకొని శమీ వృక్షం క్రింద ఉంటుంది. శమీ అంటే క్షమింపజేసేది అని అర్థం. అందుకే స్వామి, మనం ఇరువురం శమీ వద్దకు వెళ్తాం. స్వామిని మనల్ని ఒకచోట కూర్చుతుంది అమ్మ. భగవంతుని రక్షణ తప్పక లభిస్తుంది అనే ఆనందంతోటే మనం ఆశ్వయుజ మాస చివరలో దీపాలను వెలిగిస్తాం. వచ్చే కార్తీక మాసంలో స్వామి లేచి వస్తాడు. ఈ క్రమాన్ని గమనించి మన పూర్వులు శ్రావణ మాసంలో అమ్మను ఆరాధన చేసే పద్దతిని ఏర్పరిచారు. అందుకే లక్ష్మీ ప్రదమైన శ్రావణ మాసంలో అమ్మను గురించి తెలుసుకోవడం మన స్వరూపం.

Jul 21, 2012

బిల్వవృక్షం

ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె "ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది.

మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?" అని చెప్పింది. ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు.

అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు, ఆయన సూచన ప్రకారం, శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది. అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు, లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు.

గణనాథుని విన్నపం మేరకు, తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో, దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోరతపస్సు చేయసాగింది లక్ష్మీదేవి.

అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి 'ఆకలి! ఆకలి!!' అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి. శక్తికి సమర్పించబోగా, ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీదేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు. అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది.

అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, "తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు. మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి" అని దీవించాడు. ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది.