Sep 24, 2011

ద్వారకా తిరుమల


ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. అయితే ఆ మునికి ప్రత్యక్షమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు దక్షిణాభిముఖుడై ఉన్నాడట. అందుకనే.. ఈ ఆలయంలో మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అలాగే ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి మరో విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా, రెండవది స్వామివారి పై భాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండే అర్థవిగ్రహంగా ఉంటుంది.

స్థల పురాణం ప్రకారం చూస్తే... ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదిగా భావిస్తున్నారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాద సేవను కోరారట. దాంతో స్వామివారి పాదములను మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామివారి పై భాగం మాత్రమే దర్శనమిస్తుంది.

అయితే.. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారనీ... అప్పుడు భక్తులందరి విన్నపాలను స్వీకరించిన ఆయన స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై.. వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని చెబుతుంటారు.
అందుకే.. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వేంకటేశ్వర ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ.. ఆ తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామపురుషార్ధములు సమకూరుతాయనీ భక్తులు నమ్ముతుంటారు.
ద్వారకా తిరుమలలోని స్వామి వారికి అభిషేకం చేయకపోవటం మరో విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టుపడినా.. అది స్వామివారి విగ్రహం క్రిందనుండే ఎర్రచీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు. గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ, ఆశ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. ఎందుకంటే.. స్వామివారు స్వయంభువుగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్టించిన కారణంగా అలా చేస్తుంటారు.
ద్వారకా తిరుమలకు చేరుకోవడం ఎలాగంటే...? విజయవాడ-రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాలనుండి, మరియు చుట్టుప్రక్కల ఇతర పట్టణాలనుండి ప్రతిరోజూ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను నడుపుతోంది.

ఇక వసతి విషయానికి వస్తే... పద్మావతి అతిధి గృహం, అండాళ్ అతిధి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, టీటీడీ అతిధి గృహంలాంటివి ద్వారకా తిరుమల దేవస్థానం వారిచే విర్వహింపబడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రైవేటు వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏడుకొండలూ ఎక్కి స్వామివారిని దర్శించుకుని, మొక్కులను తీర్చుకోలేని భక్తులకు ద్వారకా తిరుమల దర్శనం సంతృప్తిని.. తిరుమల వెళ్ళిన అనుభూతిని, ఫలితాన్ని కలుగజేస్తూ భక్తుల నీరాజనాలను అందుకుంటోంది.